Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 61-4
సంపుటము: 1-313
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
[1]వెలికీ వెళ్ళఁడు చలికీ వెరవఁడు
వులికీ నులికీ నులికీనయ్యా
॥వెలికీ॥
రోగియై తా రుచులఁ బాయఁడు
భోగియై రతిపొం దల్లఁడు
వేగి మిగిలిన వెడచీఁకటి నీరు
తాగీఁ దాగీఁ దాగీనయ్యా
॥వెలికీ॥
తొడికీఁ దొడుకఁడు వుడికీ నుడుకఁడు
కడికీఁ గసరఁడు కడుఁ జేరఁడు
మడికీ గుడికీ మానిన మమతలఁ
బుడికీఁ బుడికీఁ బుడికీనయ్యా
॥వెలికీ॥
నిండీ నిండఁడు నెరసీ నెరయఁడు
పండీఁ బండఁడు బయలీఁతలా
అండనె తిరువేంకటాధిపుఁ దలఁపుచు
నుండీ నుండీ నుండీనయ్యా
॥వెలికీ॥

[1] దీని భావము స్పష్టమగుటలేదు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము