Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 61-6
సంపుటము: 1-315
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎడమపురివెట్టె పరహితవివేకము, లోన
గుడుసువడెఁ జదువు, మెరుఁగులువారెఁ జలము
॥ఎడమ॥
లంపు మేయఁగఁ దొణఁగె లలితంపుమతి లోనె,
తెంపు దిగవిడిచె యెడతెగని మానంబు,
చంప దొరకొనియె వేటలేని తమకంబు,
యింపు ఘనమాయ నే నిఁక నేమి సేతు
॥ఎడమ॥
బయలువందిలివెట్టు(ట్టె?) పనిలేని లంపటము,
దయ విడువఁదొడఁగె చిత్తములోని కాంక్ష,
పయికొన్న మోహంబు పడనిపాట్లఁ బరచె,
లయమాయ శాంతి మెల్లనె తీరె నెరుక
॥ఎడమ॥
చావుఁబుట్టువు మఱచె సంసారబంధంబు,
దైవమును విడిచె యా(నే?)తరికంపుఁ బ్రియము
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తరంజకుఁడు యిఁకఁ
గావలసినది యతని కరుణ ప్రాణులకు
॥ఎడమ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము