Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 62-1
సంపుటము: 1-316
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఎంతగాలమొకదా యీ దేహధారణము
చింతాపరంపరలఁ జిక్కు వడవలసె
॥ఎంత॥
పడిగొన్న మోహంబు వలలఁ దగులై కదా
కడలేని గర్భనరకము లీఁద[1]వలసె
నడిమిసుఖములచేత ననుపుసేయఁగఁ గదా
తొడరి హేయపుదిడ్డిఁ దూరాడవలనె
॥ఎంత॥
పాపపుంజములచేఁ బట్టువడఁగాఁ గదా
ఆపదలతోడి దేహము మోవవలసె
చూపులకు లోనైన సుఖము గానక [2]కదా
దీపనభ్రాంతిచేఁ దిరిగాడవలసె
॥ఎంత॥
హితుఁడైన తిరువేంకటేశుఁ గొలువక కదా
ప్రతిలేని నరకకూపమునఁ బడవలసె
అతని కరుణారసం బబ్బకుండఁగఁ గదా
బతిమాలి నలుగడలఁ బారాడవలసె
॥ఎంత॥

[1] (తా.వేం. శేషాచార్యుల వ్రాతప్రతిలో-34) నరకగర్భమునఁ బడవలసె.

[2] (నిడురేకు-18) గోరఁగఁ గదా?
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము