Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 62-2
సంపుటము: 1-317
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట[1]
తెలిసినఁ దెలియుఁడు తెలియనివారలు
తొలఁగుఁడు బ్రహ్మాదులె యెరుఁగుదురు
॥తెలిసిన॥
వరదుఁ డఖిలదేవలతకు వంద్యుఁడు
గరదుఁ డ(కరదుట?)సురలకుఁ గంటకుఁడు
పరమాత్ముఁ డంబుజ(డబ్జ)భవశివాదులకుఁ
బరులకెల్ల మువ్వురలో నొకఁడు
॥తెలిసిన॥
దేవుఁడు సనకాదిమునులకునుఁ, బర-
దైవ మఖిలవేదములకును,
కైవల్యమొసఁగు ఘననిధి, విధికి మ-
హావిధి, జడులకు[1] యాదవకులుఁడు
॥తెలిసిన॥
ఆద్యుఁ డచలుఁడు మహాభూత మితఁడ-
భేద్యుఁ డసాధ్యుఁడు భీకరుఁడు
సద్యఃఫలదుఁడు సకలమునులకును
వేద్యుఁ డితఁడె పో వేంకటవిభుఁడు
॥తెలిసిన॥

[1] (నిడురేకు-86) శ్రీరాగం.

[2] (నిడురేకు-86) జనులకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము