Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 62-3
సంపుటము: 1-318
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఎక్కువకులజుఁడైన హీనకులజుఁడైన
నిక్కమెరిఁగిన మహానిత్యుఁడే ఘనుఁడు
॥ఎక్కువ॥
వేదములు చదివియును విముఖుఁడై హరిభక్తి[1]
యాదరించని సోమయాజికంటె
యేదియునులేని కులహీనుఁడైనను విష్ణు-
పాదములు సేవించు భక్తుఁడే ఘనుడు[2]
॥ఎక్కువ॥
పరమమగు వేదాంతపఠన దొరకియు సదా
హరిభక్తిలేని సన్యాసికంటె
సరవిమాలిన యంత్యజాతికులజుఁడైన
నరసి విష్ణుని వెదకు నాతఁడే ఘనుఁడు
॥ఎక్కువ॥
వినియుఁ జదివియును శ్రీవిభుని దాసుఁడుగాక
తనువు వేఁపుచునుండు తపసికంటె
యెనలేని శ్రీవేంకటేశు ప్రసాదాన్న-
మనుభవించిన యాతఁ డప్పుడే ఘనుడు
॥ఎక్కువ॥

[1] (నిడురేకు-70) హరికథల.

[2] (నిడురేకు-70) పాదసేవకుఁడె పో బ్రాహ్మణోత్తముఁడు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము