Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 62-4
సంపుటము: 1-319
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
కనుఁగొనఁగ[1] జీవుఁ డెరఁగఁడు గాక యెరిఁగినను
అనవరత విభవంబు లప్పుడే రావా
॥కనుఁగొన॥
విసుగ కెవ్వరినైన వేఁడనేర్చన నోరు
దెసలకును బలుమారుఁ దెరచు నోరు
వసుధాకళత్రుఁ దడవదుగాక తడవినను
యెసఁగఁ గోరికలు తన[2] కిప్పుడే రావా
॥కనుఁగొన॥
ముదమంది యెవ్వరికి[3] మ్రొక్కనేర్చిన చేయి
పొదిగి యధముల నడుగఁబూను చేయి
అదన హరిఁ బూజసే[4]యదుగాక సేసినను
యెదురెదురఁ గోరికలు యిప్పుడే రావా
॥కనుఁగొన॥
తడయకేమిటికైనఁ దమకమందెడి మనసు
అడరి యేమిటికైన[5] నలయు మనసు
వడి వేంకటేశుఁ గొలువదుగాక కొలిచినను
బడిబడినె చెడని సంపద లిట్లు రావా
॥కనుఁగొన॥

[1] (నిడురేకు- 121) ఘనసుఖము జీవు.

[2] (నిడురేకు- 121) విభవములెల్ల నిప్పు.

[3] (నిడురేకు- 121) యిందరికి.

[4] (నిడురేకు- 121) యెందుకునైన నల.

[5] ‘శాయదు’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము