Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 62-6
సంపుటము: 1-321
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భవుళి
కొండ దవ్వుట యెలుక గోరిపట్టుట దీన
బండాయ సంసారబంధము
॥కొండ॥
వెలయఁ జిత్తంబునకు వేరుపురువై బుద్ధిఁ
గలఁగించె మోహవికారము
కలకాలమునకు లింగముమీఁది యెలుకయై
తలకొనియె[1] నాత్మ పరితాపము
॥కొండ॥
అరయఁ జంచలముచే నాలజాలంబువలెఁ
దిరుగ దొరకొనియెఁ దన దేహము
తిరువేంకటాచలాధిపుని మన్ననఁగాని
పరిపాటిఁ బడదు తన భావము
॥కొండ॥

[1] ‘కొనియ’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము