Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 63-1
సంపుటము: 1-322
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
[1]వీఁడివో యిదె[2] వింతదొంగ
వేఁడిపాలు వెన్న [3]వెరఁజిన దొంగ
॥వీఁడివో॥
వెలయ నీటఁ జొప్పువేసేటి[4] దొంగ
తలగాననీక దాఁగు దొంగ
తలఁకక నేల దవ్వేటి దొంగ
తెలసి సందెకాడఁ దిరిగేటి[5] దొంగ
॥వీఁడివో॥
అడుగుకింద లోక మడఁచేటి[6] దొంగ
అడరి తల్లికినైన నలుగు దొంగ
అడవిలో నెలవైయున్న దొంగ
తొడరి నీలికాసెతో నుండు దొంగ
॥వీఁడివో॥
మోస మింతుఁల జేయు మునిముచ్చు దొంగ
రాసికెక్కిన గుఱ్ఱంపు దొంగ
వేసాల కిటు వచ్చి వేంకటగిరిమీఁద
మూసిన ముత్యమై ముదమందు దొంగ
॥వీఁడివో॥

[1] ఇందు దశావతార సమన్వయము గలదు.

[2] (నిడురేకు-35) వోయల.

[3] (నిడురేకు-35) నెన్నలుఁబాలు.

[4] (నిడురేకు-35) వేసిన.

[5] (నిడురేకు-35) తిరుగాడు.

[6] (నిడురేకు-35) మణఁచిన.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము