Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 63-3
సంపుటము: 1-324
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఆదిదేవుఁడనఁగ మొదల నవతరించి జలధి సొచ్చి
వేదములును శాస్త్రములును వెదకి తెచ్చె నీతఁడు
॥ఆది॥
వాలి తిరుగునట్టి దైత్యవరుల మోహవతులనెల్ల
మూలమూలఁ ద్రోసి ముసుఁగుపాలు సేసె నీతఁడు
వేలసంఖ్యలైన సతుల వేడుక లలరఁజేసి వొంటి-
నాలిమగని రీతిఁ గూడి యనుభవించె నీతఁడు
॥ఆది॥
కడుపులోని జగములెల్లఁ గదలకుండఁ బాఁపరేని-
పడుక నొక్కమనసుతోడఁ బవ్వళించె నీతఁడు
అడుగుకింద లోకమెల్ల నడఁచఁదలఁచి గుఱుతుమీర
పొడవు వెరిగి మిన్నుజలము పొడిచి తెచ్చె నీతఁడు
॥ఆది॥
కోడెవయసునాఁడు మంచి గోపసతుల మనములెల్ల
ఆడికెలకు నోపి కొల్లలాడి బ్రదికె నీతఁడు
వేడుకలర వేంకటాద్రి వెలసి భూతకోటి దన్నుఁ
జూడుఁడనుచు మోక్షపదము చూరవిడిచె నీతఁడు
॥ఆది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము