Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 63-5
సంపుటము: 1-326
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
కాకున్న సంసారగతులేల
లోకకంటకములగు లోభంబులేల
॥కాకున్న॥
వినికి గనవలసినను విష్ణుకీర్తన చెవికి
వినికి చేసిన నదియె వేదాంతబోధ
మనికి గనవలసినను మధువైరిపై భక్తి
[1]వునికి ప్రాణులకు బ్రహ్మోపదేశంబు
॥కాకున్న॥
చదువు గనవలసినను శౌరినామము దిరుగఁ
జదువుటే సకలశాస్త్రముల సమ్మతము
నిదుర గనవలసినను నీరజాక్షునికిఁ దన-
హృదయమర్పణ సేయుటిది యోగనిదుర
॥కాకున్న॥
ఆస వలసిన వేంకటాధీశ్వరుని కృపకు-
నాస సేయుటే పరమానందసుఖము
వాసి గనవలసినను వైష్ణవాగారంబు
వాసి సేయుట తనకు వైభవస్ఫురణ
॥కాకున్న॥

[1] ‘వునికిఁ బాణులకు’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము