అధ్యాత్మ సంకీర్తన
రేకు: 63-6
సంపుటము: 1-327
రేకు: 63-6
సంపుటము: 1-327
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశి
| జీవుఁ డెంతటివాఁడు చిత్త మెంతటిది తన దైవికము గడవ నెంతటివాఁడు దాను | ॥జీవుఁడె॥ |
| విడిచిపోవని యాస విజ్ఞానవాసనలఁ [1]గడచి మున్నాడె నెక్కడి వివేకములు వుడుగనియ్యని మోహ ముబ్బి పరమార్థముల మెడవట్టి నూకె నేమిటికింక నెరుక | ॥జీవుఁడె॥ |
| పాయనియ్యని మహాబంధ మధ్యాత్మతో రాయడికిఁ దొడఁగె సైరణలేల కలుగు మాయనియ్యని కోపమహిమ కరుణామతిని వాయెత్తనియ్య దెవ్వరికిఁ జెప్పుదము | ॥జీవుఁడె॥ |
| సరిలేని యాత్మ చంచల మంతరాత్మకుని నెరఁగనియ్యదు దనకు నేఁటిపరిణత(తు?)లు తిరువేంకటాచలాధిపుని మన్ననఁ గాని వెరసి యిన్నిటి గెలువ వెరవు మఱిలేదు | ॥జీవుఁడె॥ |
[1] ‘గడచె’ కావచ్చు.


