అధ్యాత్మ సంకీర్తన
రేకు: 64-3
సంపుటము: 1-330
రేకు: 64-3
సంపుటము: 1-330
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| తెలిసియు నత్యంతదీనుఁడై తన్నుఁ దెలియఁగఁ గోరేటి తెలివే పో తెలివి | ॥తెలిసియు॥ |
| వలచిన సతి దన్ను వడిఁ గాలఁదన్నిన అలరి యెట్లా నుబ్బు నటువలెనే తలఁక కెవ్వరు[1] గాలఁదన్నినా మతిలోన అలుగక ముదమందునదివో తెలివి | ॥తెలిసియు॥ |
| అరిది మోహపు[2] వనిత ఆలిపైఁ దిట్టిన- నరవిరై చొక్కినయటువలెనే[3] పరులు దన్ను వెలుపల నిట్లఁ బలికిన అరలేక రతిఁ జొక్కునదివో తెలివి | ॥తెలిసియు॥ |
| తనివోక ప్రియకాంత తమ్ములపు రసమాన- ననయమును నటు గోరునటువలెనే తనర వేంకటపతిదాసుల ప్రసాదంబు అనిశము[4]ను గొనఁగోరునదివో తెలివి | ॥తెలిసియు॥ |
[1] (నిడురేకు) కెవ్వడు.
[2] (నిడురేకు) హవనిత.
[3] (నిడురేకు) చొక్కునట్లనే.
[4] అనయము.


