Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 64-4
సంపుటము: 1-331
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
పోరాక పోయి తలఁపుననున్న దైవంబుఁ
జేరనొల్లక పరులఁ జేరఁ దిరిగెదము
॥పోరాక॥
వడిఁబారు పెనుమృగము వలలలోపలఁ దగులు
వడి వెడల గతిలేక వడఁకుచున్నట్లు
చెడని కర్మములలోఁ జిక్కి భవముల బాధఁ
[1]బడియెదముగాక యేపనికిఁ దిరిగెదము
॥పోరాక॥
నీరులోపలి మీను నిగిడి యామిషముకై
కోరి గాలము మ్రింగి కూలఁబడినట్లు
జారిపోయిన నేల సంసారసౌఖ్యవి-
కారంపు మోహములఁ గట్టువడియెదము
॥పోరాక॥
శ్రీవేంకటేశు నాశ్రితలోకరక్షకుని
భావింప దేవతాపతియైనవాని
సేవించు భావంబు చిత్త మొడఁబడక నే-
మీవలావలి పనుల నిట్లఁ దిరిగెదము
॥పోరాక॥

[1] ‘బడియద’ రేకు. ఇట్లే తక్కిన స్థలముల.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము