Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 65-1
సంపుటము: 1-334
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
[1]ఇందరికి నభయంబు లిచ్చుఁ జేయి
కందువగు మంచి బంగారుచేయి
॥ఇందరికి॥
వెలలేని వేదములు వెదకితెచ్చిన చేయి
చిలుకుగుబ్బలికిందఁ జేర్చు చేయి
కలికియగు భూకాంతఁ గాఁ(గౌ?)గిలించిన చేయి
వలనైన కొనగోళ్ళ వాఁడిచేయి
॥ఇందరికి॥
తనివోక బలిచేత దానమడిగిన చేయి
వొనరంగ భూదానమొసఁగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకుఁ దెచ్చిన చేయి
యెనయ[2] నాఁగేలు ధరియించు చేయి
॥ఇందరికి॥
పురసతుల మానములు పొల్ల[3]సేసిన చేయి
తురగంబుఁ బరపెడి దొడ్డచేయి
తిరువేంకటాచలధీశుఁడై మోక్షంబు
తెరువు ప్రాణులకెల్లఁ దెలిపెడి చేయి
॥ఇందరికి॥

[1] ఇందు దశావతార సమన్వయము గలదు.

[2] యెనసి.

[3] పొల్లు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము