Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 65-2
సంపుటము: 1-335
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
అందరి బ్రదుకులు నాతనివే
కందువెల్ల శ్రీకాంతునిదే
॥అందరి॥
వేమరుఁ జదివెడి విప్రుల వేదము
సోము(మ?)కవైరి యశోవిభవం
శ్రీమించున మరల జీవనమెల్ల సు-
[1]ధామథనుని సంతత కరుణే
॥అందరి॥
హితవగు నిలలో నీసుఖమెల్లను
దితిసుతదమనుఁడు దెచ్చినదే
తతి తల్లిదండ్రి తానై కాచిన
రతి ప్రహ్లాదవరదుని కృపే
॥అందరి॥
అలరిన యమరేంద్రాదుల బ్రదుకులు
బలిబంధను కృపఁ బరగినవే
బలసి మునుల యాపదలు వాపుటకు
బలు నృపభంజను పరిణతలే
॥అందరి॥
పూని యనాథుల పొందుగఁ గాచిన-
జానకీవిభుని సరసతలే
నానాభూభరణంబులు నందుని-
సూనుఁడు చేసిన సుకృతములే
॥అందరి॥
తలకొని ధర్మము తానై నిలుపుట
కలుషవిదూరుని గర్వములే
నిలిచి లోకములు [2]నిలిపిన ఘనుఁడగు-
కలియుగమున వేంకటపతివే
॥అందరి॥

[1] ‘సుధామదనుని’ రేకు.

[2] ‘నిలిపిన ఘనుడగు వేంకటపతి’ అను సమాసమధ్యమున ‘కలియుగమున’ పదము చేరుట వింత. ‘కలియుగమున వేంకటపతి’ ముందు సమసించుకొని తరువాత పూర్వపదముతో సమసింపవలెనేమో? చూ. 288 పాట.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము