అధ్యాత్మ సంకీర్తన
రేకు: 65-4
సంపుటము: 1-337
రేకు: 65-4
సంపుటము: 1-337
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎండలోని నీడ యీమనసు పండు గాయ సేయఁ బనిలేదు మనసు | ॥ఎండ॥ |
వానచేతక[1]ములవలెనాయ మనసు గోనెఁబట్టిన బంకగుణమాయ మనసు మానఁజిక్కిన కోలమతమాయ మనసు తేనెలోపలి యీఁగ తెఱఁగాయ మనసు | ॥ఎండ॥ |
గడిరాజు బదుకాయ కడలేని మనసు నడివీది పెసరాయ నయమైన మనసు గడకుఁ గట్టిన పాఁతగతి దోఁచె మనసు అడుసులోపలి కంబమై తోఁచె మనసు | ॥ఎండ॥ |
తెరవుచూపిన జాడఁ దిరుగు నీమనసు[2] మరుగఁ జేసినచోట మరుగు నీ మనసు తిరువేంకటేశుపైఁ దిరమైన మనసు సిరిగలిగినచోటఁ జేరు నీమనసు | ॥ఎండ॥ |
[1] ‘చాతక’ కావచ్చు.
[2] ‘తిరుగును + ఈ మనసు.’ తక్కిన స్థలములలో ఇంతే.