Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 65-5
సంపుటము: 1-338
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
అలర నుతించరో హరిని
యెలయించి మిము భ్రమయించీనిఁ గాలము
॥అలర॥
సేయరో మనుజులార చింత హరి నిఁకనైన
రోయరో మీభుజియించు రుచులమీఁద
కాయ మస్థిరము యీ కలి మధ్రువము చాలఁ
బోయఁబో యెందుకుఁ గాకపోయఁ గాలము
॥అలర॥
మెచ్చరో మనుజులార మీరే హరికథలు
పుచ్చరో మీమదిలోని పొరలెల్లాను
కొచ్చరో మనుజులార కోరికలెల్లను మీకు-
నిచ్చీని శుభములు యివి యెల్లకాలము
॥అలర॥
కనరో వేంకటపతిఁ గన్నులు దనియఁగా
వినరో యీతని స్తుతి వీనులు నిండ
మనరో శ్రీహరిచేతి మన్ననలు(ల?) మీరు
తనమీఁది మది బుద్ధి దాఁచీనిఁ గాలము
॥అలర॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము