Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 65-6
సంపుటము: 1-339
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి[1]
చదివెఁబో ప్రాణి సకలము యీ-
చదువుమీఁది [2]విద్య చదువఁడాయఁ గాని
॥చదివె॥
సిరులు చంచలమని చేఁత లధ్రువమని
పరగు సంసారము బయలని
తొరలిన సుఖమెల్ల దుఃఖమూలమని
యెరిఁగి లోభము వీడ నెరఁగఁడాయఁ గాని
॥చదివె॥
తలకొన్న ధర్మమే[3] తలమీఁది మోఁపని
వలసీ నొల్లమి దైవవశమని
కలిమియు లేమియుఁ గడవఁగ[4] రాదని
తెలిసి లోభము వీడఁ దెలియఁడాయఁ గాని
॥చదివె॥
యేచిన పరహితమెంతయుఁ దమ[5] దని
వాచవులిన్ని [6]నెవ్వగలని
యీచందమున వేంకటేశు చేఁతలని[7]
చూచి లోభము వీడఁ జూడడాయఁ గాని
॥చదివె॥

[1] (నిడురేకు-34) దేవగాంధారి.

[2] ‘చదువు’ పూ.ము.పా.

[3] కర్మమే.

[4] గడవఁగ.

[5] దనదని.

[6] లెల్ల.

[7] లన్ని చూచి యాతుమఁ దన్నుఁ జూడ.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము