Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 66-1
సంపుటము: 1-340
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
ఎందుఁ జూచినఁ దనకు నిన్నియును నిట్లనే
కందులేని సుఖము కలనైన లేదు
॥ఎందు॥
సిరులు గలిగిన ఫలము చింతఁ బొరలనె కాని
సొరిది సంతోష మించుకయైన లేదు
తరుణిగల ఫలము వేదనలఁ బొరలుటె కాని
నెరసులేని సుఖము నిమిషంబు లేదు
॥ఎందు॥
తనువుగల ఫలము పాతకము సేయనె కాని
అనువైన పుణ్యంబు అది యింత లేదు
మనసుగల ఫలము దుర్మతిఁ బొందనే కాని
ఘనమనోజ్ఞానసంగతి గొంత లేదు
॥ఎందు॥
చదువుగలిగిన ఫలము సంశయంబే కాని
సదమలజ్ఞాననిశ్చయ మింత లేదు
యిది యెరిఁగి తిరువేంకటేశ్వరునిఁ గొలిచినను
బ్రదుకు గలుగును భవము ప్రాణులకు లేదు
॥ఎందు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము