Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 68-1
సంపుటము: 1-352
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
కాయము జీవుఁడు గలనాఁడే తెలియవలె
యీ యత్నములు దనకెన్నఁడు
॥కాయము॥
సతతము సంసారజడుఁడు దానట యాత్మ-
హితవు దెలుసు కాల మెన్నఁడు
రతిసరసముల పూరకే ప్రాయ మెడలంగ
యితరసుఖము దన కెన్నఁడు
॥కాయము॥
యెడపక ద్రవ్యమోహితుఁడై తిరుగఁ దన-
యిడుమపాటు మాను టెన్నఁడు
కడలేని పొలయలుకలచేతఁ దన దేహ-
మిడియఁగ నిజసుఖ మెన్నఁడు
॥కాయము॥
శ్రీవేంకటేశునిఁ జేరి తక్కిన సుఖ-
మేవగించు కాల మెన్నఁడు
శ్రీవల్లభుని కృప సిరిగాఁ దలఁచి జీవుఁ -
డీవైభవముఁ గాంచు టెన్నఁడు
॥కాయము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము