Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 69-3
సంపుటము: 1-360
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
[1]ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటా
కొత్తసేఁతలెల్ల దొరకొంటిగా నీవు
॥ఇత్తడి॥
హీనులైనవారు నిన్ను నేచి కొలిచిన ఘన-
మైన పదవులఁ బెట్టే[2]యె(య?)టువలెనే
మానక యెవ్వతెనైన మచ్చికఁ దగిలి నాతో-
నానిపట్టి సరివేసే వద్దిరా నీవూ
॥ఇత్తడి॥
కడుఁ బాతకులు నిన్నుఁ గదిసి కొలిచేరంటా-
నడరి పుణ్యులఁ జేయునటువలెనే
కడఁగి యెవ్వతెనైన గాజు మాణికము సేసి
వడి నన్నుఁ గెరలించవద్దురా నీవూ
॥ఇత్తడి॥
దిందుపడ మాయసేసి దేవుఁడ నేఁ గానంటా-
నందరి భ్రమలఁ బెట్టునటువలెనే
అందమైన తిరువేంకటాద్రీశ నీప్రేమ
చెంది నన్నుఁ గూడి దాఁచజెల్లునా నీవూ
॥ఇత్తడి॥

[1] 359, 360 పాటలు రెండూ పూర్వముద్రణమున తప్పిపోయినవి. 359వ పాట శుద్ధశృంగారసంకీర్తనములలో నుండదగినది. 360వ పాట వేదాంతవిషయోపమానములతో కూడిన శృంగారసంకీర్తనము.

[2] యతిభంగము.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము