Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 70-3
సంపుటము: 1-366
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశాక్షి
సీతాశోకవిఘాతక వో-
పాతాళలంకాపతివిభాళా
॥సీతా॥
హనుమంతరాయ [1]అంజనీతనయ వో-
వనధిలంఘనగాత్ర వాయుపుత్రా
యినకులాధిపనిజహిత జగన్నుత-
వనజోదరసేవక సత్వధనికా
॥సీతా॥
ప్రళయాంతకరూప బలదీప రవిఫల-
గిళనప్రతాప సుగ్రీవప్రియా
కుళకదానవసంకులవిదారణ
భళిభళి జగత్పతిబలుబంటా
॥సీతా॥
పంకజాసనుదివ్యపదవైభవ వో-
లంకిణీప్రాణవిలంఘన
వేంకటేశ్వరు సేవావీర మహాధీర
కింకరరాయ సుఖీభవా
॥సీతా॥

[1] ‘అంజినీ’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము