Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 80-3
సంపుటము: 1-384
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు
యిందరిలోపల నీ వెడమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా
॥కొందరి॥
దూరము కర్మమునకు జ్ఞానము; తోడనే(తొడుసే?) వొండొకటికిని
దూరము; పరమునకు బ్రపంచము తొలుత విరుద్ధంబు;
దూరము విరతికి సంసారము; తుద మొదలే లేదు;
యీ రీతుల నీ వెడమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా
॥కొందరి॥
కూడదు దేహమునకు నాత్మకు గోత్రవిరోధం; బెన్నఁడును
కూడదు కోపమునకు శాంతము గుణావగుణములను;
కూడదు బంధమునకు మోక్షము కోరికలే కట్లుగాన;
యేడ గొలఁదిగా శ్రీహరిమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా
॥కొందరి॥
శ్రీవేంకటపతి నన్నీ గతిఁ జిక్కించితి వీజగమునను;
భావింపఁగరాదు నీ మహిమ బహుముఖముల యర్థముగాన;
యేవిధమును నేఁటికి నాకిఁక యెందెందని తగిలెద నేను
దైవికమగు నీ[1] దాసానుదాస్యము దక్కినదే నాకు
॥కొందరి॥

[1] ‘దాసాన’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము