అధ్యాత్మ సంకీర్తన
రేకు: 80-4
సంపుటము: 1-385
రేకు: 80-4
సంపుటము: 1-385
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామా | ॥అంతయు॥ |
| కులమును నీవే గోవిందుఁడా, నా- కలిమియు నీవే కరుణానిధీ, తలఁపును నీవే ధరణీధరా, నా- నెలవును నీవే నీరజనాభా | ॥అంతయు॥ |
| తనువును నీవే దామోదరా, నా- మనికియు నీవే మధుసూధనా, వినికియు నీవే విట్ఠలుఁడా, నా- వెనకముందు నీవే విష్ణుదేవుఁడా | ॥అంతయు॥ |
| పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నట్టనడుము నీవే నారాయణా, యిట్టె శ్రీవేంకటేశ్వరుఁడా నాకు నెట్టన గతి యింక నీవే నీవే | ॥అంతయు॥ |


