అధ్యాత్మ సంకీర్తన
రేకు: 80-5
సంపుటము: 1-386
రేకు: 80-5
సంపుటము: 1-386
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| అన్నిటా నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినాను యెన్నఁగ నీవొక్కఁడవే గతియని [1]యెంచి కొలుచుటే ప్రపన్న[2]సంగతి | ॥అన్నిటా॥ |
| యేకాంతంబున నుండిన పతిని యెనసి రమించుటే సతిధర్మంబు లోకము రచ్చలోనుండిన పతి లోఁగొని పైకొని(న?) రానట్లు; యీ కొలఁదులనే సర్వదేవతల యిన్నిరూపులై నీ వున్నప్పుడు కైకొని నిను బహుముఖములఁ గొలుచుట గాదు పతివ్రతధర్మంబు | ॥అన్నిటా॥ |
| పూనిన బ్రాహ్మణుల లోపలనే నినుఁ బూజించుట వేదోక్తధర్మము శ్వానకుక్కుటాదులలోపల నిను సరిఁ బూజించఁగ రానట్లు యీ నియమములనె ప్రాకృతజనులను యీశ్వర నీ శరణాగత జనులను కానక, వొక్కట సరిగాఁ [3]జూచుట కాద(ది?) వివేకధర్మంబు | ॥అన్నిటా॥ |
| శ్రీవేంకటపతి గురువనుమతినే సేవే నాకును శిష్యధర్మము ఆవలనీవల నితరమార్గములు యాత్మలోన రుచిగానట్లు, భావింపఁగ సకలప్రపంచమును బ్రహ్మం సత్యజ్ఞానమనంతము కైవశమై యిన్నిటా వెనుతగులు కాద(ది?) వివేకధర్మంబు | ॥అన్నిటా॥ |
[1] ‘యేచి కొలుచుటే’ రేకు.
[2] ‘సుగతి’ రేకు.
[3] ‘చూచుటకాద + వివేకధర్మంబు’ అని విభజింపవచ్చునేమో?


