Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 80-6
సంపుటము: 1-387
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
[1]కోరు వంచరో [2]కోటారు
ఆరసి మనసా అంతరాత్మకు
॥కోరు॥
కొండల పొడవులు కోరిక కుప్పలు
పండిన పంటలు భవము లివి
నిండిన రాసులు నిజకర్మంబులు
అండనె యివె మాయారంభములు
॥కోరు॥
వెలిధాన్యంబులు విషయపురాసులు
[3]పొలివారేటి వూరుపుగములు(?)
కలుషపు మదమున కావుగప్పినవి
అలవిమీర మాయారంభములు
॥కోరు॥
బడి నింద్రియముల బంతులు సురిపి
కడు రతుల దండగట్టలతో
యెడనెడ శ్రీవేంకటేశుమహిమ లవే
అడియాలపు మాయారంభములు
॥కోరు॥

[1] కోరు + పంచరో.

[2] ‘కొటారు’ కావచ్చు.

[3] పొలివారుట = తూర్పెత్తుట, తూర్పుపారుట కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము