అధ్యాత్మ సంకీర్తన
రేకు: 81-1
సంపుటము: 1-388
రేకు: 81-1
సంపుటము: 1-388
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| వీనిఁ జూచియైన నేము విరతిఁ బొందగలేము పూని మా బ్రదుకిందుఁ బోలదాయఁగా | ॥వీని॥ |
| పరుల వేడఁగబోవు పరనిందకుఁ జొరవు పరపురుషార్థమే ఫలవృక్షతతులెల్ల నరులమై ఘనులమై నానాబుద్ధు లెఱిఁగి పొరి మా బ్రదుకులిందుఁ బోలదాయఁగా | ॥వీని॥ |
| కామక్రోధాదులు లేవు కామతత్వ మెఱఁగవు కామించినట్లవు నెక్కడనైనా శిల లివి దీమసము గలిగియుఁ దెలివి గలిగియును భూమిలో మా బ్రదుకిందుఁ బోలదాయఁగా | ॥వీని॥ |
| వొకరిఁ గొలువఁబోవు వొకపంట సేయఁబోవు వొకమాని గూడు చేరివుండు పక్షు లాడనాడ వొక శ్రీవేంకటపతి నమ్మియుండలేము [1]మొకెమో మా బ్రదుకిందుఁ బోలదాయఁగా | ॥వీని॥ |
[1] ‘ముఖ్య’ శబ్దభవమా? అర్థము అదే కావచ్చు.


