Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 81-2
సంపుటము: 1-389
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
పనిమాలినట్టి వట్టి[1]పఱఁదుగాక । మాకు
ననిచి యిదియు నొక్క నగుఁబాట్లా
॥పని॥
కన్నవారినెల్లా వేఁడే కష్టమే దక్కుటగాక
పన్ని దైవమియ్యనిది పరులిచ్చేరా
యెన్నికతోఁ దేహమిచ్చె నిహమెల్లాఁ జెందనిచ్చె
వున్నవా రింతటిపని కోపఁగలరా
॥పని॥
బడలి తానెందైనాఁ బడ్డపాటే దక్కెఁ గాక
[2]కడఁగి రానిది దే నొక్కరి వసమా
కడుపులో నుండఁగానే కలవి నుదుట వ్రాసె
తడవి దైవముచేఁత దాఁట వసమా
॥పని॥
దెప్పరపు సంపదకుఁ దిమ్మటలే దక్కెఁ గాక
యెప్పుడూ శ్రీవేంకటేశుఁ[3] డీక మానీనా
చప్పుడుగా నతనికే శరణన్న జాలుఁ గాక
తప్పులును వొప్పులు నాతనివే కావా
॥పని॥

[1] ‘పఱఁడు’ పూ.ము.పా.

[2] ‘కడఁగిరాని దిదే నొక్కరి వసమా’ పూ.ము.పా.

[3] ‘డిక మానీనా’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము