Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 81-4
సంపుటము: 1-391
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
ఇటు గన సకలోపాయము లుడిగిన యీశ్వరుఁడే రక్షకుఁడు
తటుకున స్వతంత్ర ముడిగిన యాత్మకు తగు నిశ్చింతమే పరసుఖము
॥ఇటు॥
ఆఁకటి కడుగని శిశువుకుఁ దల్లి యడిచి పాలు ద్రాగించిన రీతి
యీ కడఁ గోరిక లుడిగిన యోగికి నీశ్వరుఁడే రక్షకుఁడు
చేకొని బుద్ధెఱిఁగిన బిడ్డలపైఁ జింతింపరు తొల్లిటివలెఁ దల్లులు
యీ కొలఁదులనే స్వయత్నదేహుల కీశ్వరుఁడును వాత్సల్యము వదలు
॥ఇటు॥
తతిఁ గరిరాజుఁ గాచినయట్లు ద్రౌపదిమానము గాచినయట్లు
హితమతి స్వతంత్ర ముడిగిన యోగికి యీశ్వరుఁడే రక్షకుఁడు
అతనుఁడు భస్మంబయ్యిననాఁడు అజుని శిరంబటు ద్రుంచిననాఁడు
చతురుఁడు దా నడ్డము రాఁడాయను స్వతంత్ర ముడుగని జీవులుగాన
॥ఇటు॥
దిక్కని యనిశముఁ జిత్తములో[1]నఁ జింతించేటి శరణాగతజనులకు,
యిక్కడనక్కడ శ్రీవేంకటగిరియీశ్వరుఁడే రక్షకుఁడు
మక్కువతోఁ దన యంతర్యామిని మఱచిన స్వామి ద్రోహులకెల్లా
అక్కరతోఁ బుట్టుగులే భోగ్యం బహంకారము విడువరుగాన
॥ఇటు॥

[1] ‘లోనాఁ’ పూ.ము.పా. రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము