Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 81-5
సంపుటము: 1-392
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా
సౌమిత్రిభరతశత్రుఘ్నులతోడ జయమందు దశరథరాఘవా
॥రామ॥
శిరసు కూఁకటుల రాఘవా చిన్నారి పొన్నారి రాఘవా
గరిమ నా వయసునఁ దాటకిఁ జంపిన కౌసల్యనందన రాఘవా
అరిది యజ్ఞముగాచు రాఘవా అట్టె హరువిల్లు విఱిచిన రాఘవా
సిరులతో జనకుని యింటను జానకిఁ జెలఁగి పెండ్లాడిన రాఘవా
॥రామ॥
మలయు నయోధ్యా రాఘవా మాయామృగాంతక రాఘవా
చెలఁగి చుప్పనాతి గర్వ మడఁచి దైత్యసేనలఁ జంపిన రాఘవా
సొలసి వాలిఁ [1]జంపి రాఘవా దండి సుగ్రీవునేలిన రాఘవా
జలధి బంధించిన రాఘవా లంక సంహరించిన రాఘవా
॥రామ॥
దేవతలు చూడ రాఘవా నీవు దేవేంద్రు రథమెక్కి రాఘవా
రావణాదులనుఁ జంపి విభీషణు రాజ్యమేలించిన రాఘవా
వేవేగ మరలి రాఘవా వచ్చి విజయ పట్టమేలి [2]రాఘవా
శ్రీవేంకటగిరిమీఁద నభయము చేరి మాకిచ్చిన రాఘవా
॥రామ॥

[1] ‘జంపిన’ కావచ్చు.

[2] ‘మేలిన’ కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము