అధ్యాత్మ సంకీర్తన
రేకు: 82-4
సంపుటము: 1-396
రేకు: 82-4
సంపుటము: 1-396
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఓహో డేండేం వొగి బ్రహ్మమిదియని సాహసమున శ్రుతి చాటెడిని | ॥ఓహో॥ |
| పరమును నపరముఁ బ్రకృతియు ననఁగా వెరవు దెలియుటే వివేకము పరము దేవుఁడును; అపరము జీవుఁడు, తిరమైన ప్రకృతియె దేహము | ॥ఓహో॥ |
| జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును వూని తెలియుటే యోగము [1]జ్ఞానము దేహాత్మ, జ్ఞేయము పరమాత్మ, జ్ఞానగమ్యమే సాధించు మనసు | ॥ఓహో॥ |
| క్షరము నక్షరమును సాక్షి పురుషుఁడని సరవిఁ దెలియుటే సాత్వికము క్షరము ప్రపంచ, మక్షరము కూటస్థుఁడు, సిరి పురుషోత్తముఁడే శ్రీవేంకటేశుఁడు | ॥ఓహో॥ |
[1] ఈ రెండుమూఁడు పాదముల యర్థము అంతగా సరిపోయినట్లు తోచదు.


