Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 82-5
సంపుటము: 1-397
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
చీ చీ నరుల దేఁటి జీవనము
కాచుక శ్రీహరి నీవే కరుణింతు గాక
॥చీ చీ॥
అడవిలో మృగజాతియైనఁ గావచ్చుఁ గాక
వడి నితరులఁ గొలువఁగ వచ్చునా
వుడివోని పక్షియై వుండనైనా వచ్చుఁ గాక
విడువ కెవ్వరినైనా వేఁడవచ్చునా
॥చీ చీ॥
పసురమై వెదలేని పాటు వడవచ్చుఁ గాక
కసివో నొరుల బొగడగా వచ్చునా
[1]వుసురుమానై పుట్టివుండనైన వచ్చుగాక
విసువక వీరి వారి వేసరించవచ్చునా
॥చీ చీ॥
[2]యెమ్మెల బుణ్యాలు సేసి యిల యేలవచ్చుఁ గాక
కమ్మి హరిదాసుఁడు గావచ్చునా
నెమ్మది శ్రీవేంకటేశ నీ చిత్తమే కాక
దొమ్ముల కర్మము లివి తోయవచ్చునా
॥చీ చీ॥

[1] వుసురుమాను = (ప్రకరణమును బట్టి) ముసిడిమాను (ముష్టిచెట్టు) కావచ్చునేమో?

[2] ‘యెమ్మెలఁ ... .. గావచ్చునా’ ఈ రెండు పాదములు అన్నమయ్య స్వభావమునకు విరుద్ధముగా నున్నవి.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము