Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 82-6
సంపుటము: 1-398
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
ఇంతే మఱేమిలేదు యిందుమీఁదను
దొంతుల కర్మాలు దుమ్ము దూరుపెత్తుట
॥ఇంతే॥
వుల్లములో నుండి దేహ మొగి రక్షించే హరి-
నొల్లకున్న తన్నుఁ దా నొల్లకుండుట
బల్లిదుఁ డాతని మాని పరుల వేఁడేదెల్లా
పొల్లకట్టు దంచి దంచి పోగు సేసుకొనుట
॥ఇంతే॥
[1]యెయ్యెడాఁ బుణ్యఫలము లేమి గలిగిన హరి-
కియ్యకున్న నది దైవమియ్యకుండుట
చెయ్యార నాతని కొప్పు సేయని భోగములెల్లా
చయ్యన [2]జెఱకుఁ బిప్పి చవిగొనుట
॥ఇంతే॥
శ్రీకాంతుడైనట్టి శ్రీవేంకటేశ్వరునిఁ
జేకొంటే సిరులెల్లాఁ జేకొనుట
మేకుల శ్రీహరినామమే నోర నుడుగుట
కైకొన్న యమృతపుగందు వగుట
॥ఇంతే॥

[1] ‘యేయడాఁ’ రేకు. ప్రాసభంగము.

[2] ‘జఱకుఁ’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము