Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 83-1
సంపుటము: 1-399
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇతరధర్మము లందు నిందు గలదా
మతిఁ దలపఁ పరము నీ మతముననే కలిగె
॥ఇతర॥
విదురునకుఁ బరలోకవిధి చేసెనట తొల్లి
అదె ధర్మసుతుఁడు వర్ణాశ్రమంబులు విడిచి
కదిసి నీ దాసుఁడై న కతముననే కాదె యీ
యెదురనే తుదిపదం బిహముననే కలిగె
॥ఇతర॥
అంటరాని గద్దకుల[1]మంటి జటాయువుకు నీ
[2]వంటి పరలోకకృత్యములు సేసితివి మును
వెంట నీ కైంకర్యవిధి కలిమినేకాదె
వొంటి నీ హస్తమున నో(యో?)గ్యమై నిలిచె
॥ఇతర॥
యిరవైన శబరి రుచులివియె నైవేద్యమై
పరగెనట శేషమును బహునిషేధములనక
ధర దదీయప్రసాదపు విశేషమేకాదె
సిరుల శ్రీవేంకటేశ చెల్లుబడులాయ
॥ఇతర॥

[1][2] ‘అంటి’ ‘అంటి’ ఇవి పునరుక్తులు. ఇట్టి వక్కడక్కడ గలవు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము