Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 83-2
సంపుటము: 1-400
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
దేవదేవుఁ డెక్కె నదె [1]దివ్యరథము
మావంటివారికెల్ల మనోరథము
॥దేవ॥
జగతి బాలులకై జలధులు వేరఁ జేసి
పగటునఁ దోలె నదె పైఁడిరథము
మిగులఁగఁ గోపగించి మెరయు రావణుమీఁద
తెగి యెక్కి తోలేనదె దేవేంద్రరథము
॥దేవ॥
దిక్కులు సాధించి సీతాదేవితో నయోధ్యకుఁ
బక్కన మరలిచెఁ బుష్పకరథము
నిక్కి నరకాసురుపై నింగి మోవ నెక్కి తోలె
వెక్కసపు రెక్కలతో విష్ణురథము
॥దేవ॥
బలిమి రుక్మిణి దెచ్చి పరుల గెలిచి యెక్కె
అలయేఁగు బెండ్లి కల్యాణరథము
యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగఁ గూడి
కలకాలమును నేగె ఘనమైన రథము
॥దేవ॥

[1] ‘దియ్య’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము