Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 84-2
సంపుటము: 1-406
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
శ్రీహరి సేసిన చిహ్నలివి యీ-
మోహము విడుచుట మోక్షమది
॥శ్రీహరి॥
మలినంబేది మణుఁగననేది
కలుషపు మలముల కాయమిది
కలిగినదేది కడు లేందేది
చలనపు మాయల జన్మ మిది
॥శ్రీహరి॥
తనిసినదేది తనియనిదేది
దినదిన మాఁకలి దీరదిది
కొన యిందేది గుఱి మొదలేది
పనిగొను కర్మపు బంధ మది
॥శ్రీహరి॥
నిండినదేది నిండనిదేది
కొండల పొడవుల కోరి కది
అండనె శ్రీవేంకటాధిపు శరణని
వుండుటె యిహపరయోగ మది
॥శ్రీహరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము