అధ్యాత్మ సంకీర్తన
రేకు: 84-3
సంపుటము: 1-407
రేకు: 84-3
సంపుటము: 1-407
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట[1]
| దైవమా నీకు వెలితా తలఁపు వెలితే కాక వేవేలు కర్మాల వేసారఁగ వలసె | ॥దైవమా॥ |
| హరి యంటేఁ బాపేటి అన్ని పాపాలు సేసిన పొరి నందుపై నమ్మిక పుట్టదుగాక నరసింహా యంటే వచ్చే నానాపుణ్యాలకు తిరముగా ఋణములు దీర్చుకొనఁగలవా | ॥దైవమా॥ |
| దేవ జగన్నాథ యంటే తెగని జన్మము లేవి కైవశము నా మనసు గాదుగాక గోవిందయని యంటేఁ గూడని పదవు లేవి కావిరిఁ గాల మూరకె కడపేము నేము | ॥దైవమా॥ |
| వేదనారాయణయంటే [2]వీడేటి బంధములు ఆదిగా మూఁడులోకాలనైనా [3]నున్నదా శ్రీదేవిపతియైన శ్రీవేంకటేశ్వరుఁడా యే దెసా నీవే నన్ను యీడేర్తువుగాక | ॥దైవమా॥ |
[1] ‘సాళంగం’ పూ.ము.పా.
[2] ‘వీడని’ కావచ్చు.
[3] ‘నున్నవా’ కావచ్చు.


