Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 84-6
సంపుటము: 1-410
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
భక్తికొలఁదివాఁడే పరమాత్ముఁడు
భుక్తి ముక్తిఁ దానే యిచ్చు భువిఁ బరమాత్ముఁడు
॥భక్తి॥
పట్టినవారి చేబిడ్డ పరమాత్ముఁడు
బట్టబయటి ధనము పరమాత్ముఁడు
పట్టపగటి వెలుఁగు పరమాత్ముఁడు
యెట్టనెదుటనే వున్నాఁడిదె పరమాత్ముఁడు
॥భక్తి॥
పచ్చిపాలలోని వెన్న పరమాత్ముఁడు
బచ్చిన వాసిన రూపు పరమాత్ముఁడు
బచ్చుచేతి వొరగల్లు పరమాత్ముఁడు
యిచ్చకొలఁదివాడువో యీ పరమాత్ముఁడు
॥భక్తి॥
పలుకులలోని తేట పరమాత్ముఁడు
ఫలియించు నిందరికిఁ బరమాత్ముఁడు
బలిమి శ్రీవేంకటాద్రి పరమాత్ముఁడు
యెలమి జీవుల ప్రాణ మీ పరమాత్ముఁడు
॥భక్తి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము