Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 85-1
సంపుటము: 1-411
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
మిక్కిలి పుణ్యులు హరి మీ దాసులే హరి
తక్కినవారు మీకృప దప్పినవారు హరి
॥మిక్కిలి॥
వున్నతపు సంపదల నోలలాడేయట్టివాఁడు
మున్నిటి జన్మాన నీకు మొక్కినవాఁడు హరి
పన్ని పడనిపాట్లఁ బరులఁ గొలిచేవాఁడు
వున్నతి మిము సేవించనొల్లనివాఁడు హరి
॥మిక్కిలి॥
పూని దేవేంద్రాదులై పొడవుకెక్కినవారు
శ్రీనాథ మిమ్మునే పూజించినవారు హరి
నానానరకముల నలఁగుచుండేవారు
నానాఁడే నీ మహిమ నమ్మనివారు హరి
॥మిక్కిలి॥
పావనులై నిజభక్తిఁ బ్రపన్నులయ్యినవారు
శ్రీవేంకటేశ మిమ్ముఁ జేరినవారె హరి
వేవేలు దేవతలవెంట దగిలేటివాఁడు
కావించి మిమ్మెఱఁగని కర్మి యాతఁడే హరి
॥మిక్కిలి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము