Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 85-6
సంపుటము: 1-416
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
తెలియరాదు మాయదేహమా మమ్ము
పలువికారాలఁ బెట్టి పనిగొన్న దేహమా
॥తెలియ॥
దినమొక్క వయసెక్కే దేహమా సారె
పెనుమదము గురిసే బెండుదేహమా
దినదిన రుచిగోరే దేహమా నన్ను
ఘనమోహపాశాలఁ గట్టెఁగదె దేహమా
॥తెలియ॥
తెలివి నిద్రలుగల దేహమా నీ-
పొలము పంచభూతాల పొత్తు దేహమా
తిలకించి పాపపుణ్యాల దేహమా
బలువు గలదాఁకా బదుకవో దేహమా
॥తెలియ॥
తీరని సంసారపు దేహమా ఇట్టె
వూరటలేని భోగాల వోదేహమా
కూరిమి శ్రీవేంకటేశుఁ గొలిచితి నిఁక నాకు
కారణజన్మమవై కలిగిన దేహమా
॥తెలియ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము