Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 86-2
సంపుటము: 1-418
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
ఇదియే మర్మము హరి యిందుఁగాని లోనుగాఁడు
పదపడి జీవులాల బదుకరో
॥ఇదియే॥
హరి గానలేరు మీరు [1]అరసెందువెదకినా
హరిదాసు లెఱుఁగుదు రడుగరో
గరిమెఁ బ్రత్యక్షము గాఁడు దేవుఁ డెవ్వరికి
ధరఁ బ్రత్యక్షము హరిదాసుల గొలువరో
॥ఇదియే॥
చేత ముట్టి గోవిందుని శిరసు వూజించలేరు
చేతులార ప్రపన్నులసేవ సేయరో
జాతిగాఁగ విష్ణుని ప్రసాద మేడ దొరకీని
ఆతల వారిఁ బ్రసాద మడుగరో
॥ఇదియే॥
అంతరంగమున నున్నాఁడందురు విష్ణుడు గాని
అంతటా నున్నారు వైష్ణవాధికులు
చెంతలఁ దదియ్యుల చేతియనుజ్ఞ వడసి
సంతతం శ్రీవేంకటేశు శరణము చొరరో
॥ఇదియే॥

[1] అరసి + ఎందున్ + వెదకినా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము