అధ్యాత్మ సంకీర్తన
రేకు: 86-4
సంపుటము: 1-420
రేకు: 86-4
సంపుటము: 1-420
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఎంత విచారించుకొన్నా నిదియే తత్వము హరి వంతుకు నీకృప గలవాడే యెఱుఁగు హరి | ॥ఎంత॥ |
| నిన్ను నమ్మినట్టివాఁడు నిఖిలవంద్యుఁడు హరి నిన్ను నొల్లనట్టివాఁడు నీరసాధముఁడు హరి మున్ను దేవతలు నీకు మొక్కి బదికిరి హరి వున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి | ॥ఎంత॥ |
| యేపున నీపేరిటివాఁడిన్నిటా ధన్యుఁడు హరి నీ పేరొల్లనివాఁడు నిర్భాగ్యుఁడే హరి [1]కేపుల నిన్నుఁ నుతించి గెలిచె నారదుఁడు హరి పైపై నిన్ను దిట్టి శిశుపాలుఁడు వీఁగెను హరి | ॥ఎంత॥ |
| యిట్టె నీవిచ్చిన వర మెన్నఁడు జెడదు హరి గట్టిగా నీవియ్యనివి కపటములే హరి అట్టె శ్రీవేంకటేశ నీ వంతరంగుఁడవు హరి వుట్టిపడి కానకున్న వొచ్చము దేహికి హరి | ॥ఎంత॥ |
[1] ‘కైపుల’ కావచ్చు.


