Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 86-5
సంపుటము: 1-421
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
[1]నగుమొగముతోడి వో నరకేసరి
నగరూప గరుడాద్రి నరకేసరి
॥నగు॥
అమితదానవహరణ ఆదినరకేసరి
నమితబ్రహ్మాదిసుర నరకేసరి
కమలాగ్రవామాంక కనకనరకేసరి
నమో నమో పరమేశ నరకేసరి
॥నగు॥
రవిచంద్రశిఖినేత్ర రౌద్రనరకేసరి
నవనారసింహ నమో నరకేసరి
భవనాశినీతీర భవ్యనరకేసరి
నవరసాలంకార నరకేసరి
॥నగు॥
శరణాగతత్రాణ సౌమ్యనరకేసరి
నరకమోచననామ నరకేసరి
హరి నమో శ్రీవేంకటాద్రి నరకేసరి
నరసింహ జయ జయతు నరకేసరి
॥నగు॥

[1] భక్తిపారవశ్యమున పాడిన ఈ పాటలో సంస్కృతాంధ్ర సంధిసమాసములు, పదములూ పెద్దలు విమర్శింపరు. ‘నరకేసరీ’ అని దీర్ఘాంతమగుట మంచిదేమో?
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము