Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 86-6
సంపుటము: 1-422
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
వాఁడె వేంకటాద్రిమీఁద పరదైవము
పోఁడిమితోఁ బొడచూపెఁ బొడవైన దైవము[1]
॥వాఁడె॥
వొక్కొక్క రోమకూపాన నొగి బ్రహ్మాండకోట్లు
పిక్కటిల్ల వెలుఁగొందే పెనుదైవము
పక్కనను తనలోని పదునాలుగు లోకాలు
తొక్కి పాదానఁ గొలచే దొడ్డదైవము
॥వాఁడె॥
వేదశాస్త్రాలు నుతించి వేసరి కానఁగలేని
మోదపు పెక్కుగుణాల మూలదైవము
పోది దేవతలనెల్లఁ బుట్టించ రక్షించ
ఆదికారణంబైన అజుఁ గన్న దైవము
॥వాఁడె॥
సరుస శంఖచక్రాలు సరిఁబట్టి యసురల
తరగి పడవేసిన దండిదయివమూ
సిరి వురమున నించి శ్రీవేంకటేశుఁడయి
శరణాగతులఁ గాచే సతమయిన దయివము
॥వాఁడె॥

[1] ‘దేహము’ పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము