Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 87-1
సంపుటము: 1-423
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
సులభమా యిందరికిఁ, జూడ సులభము గాక
కలిగె మీకృప నాకుఁ గమలారమణా
॥సులభ॥
సతతదయాచారసంపన్నుఁడై మఱి కదా
అతిశయవైష్ణవాన కరుహుడౌట
వ్రతోపవాసతీర్థవరసిద్ధుఁడై కదా
మితిమీరి నరహరి మీ దాసుఁడౌట
॥సులభ॥
సకలయజ్ఞఫలము సత్యము ఫలము గదా
ప్రకటించి విష్ణునామపాఠకుఁడౌట
అకలంకమతితోడ నాజన్మశుద్ధుఁడై కదా
అకుటిలమగు మీ చక్రాంకితుఁడౌట
॥సులభ॥
కెరలి సదాచార్యకృప గలిగిన గదా
నిరతి శ్రీవేంకటేశ నిన్నుఁ గనుట
మరిగి మీపై భక్తి మఱి ముదిరినఁ గదా
అరయ మీకే శరణాగతుఁడౌట
॥సులభ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము