Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 87-2
సంపుటము: 1-424
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
అదె వాఁడె యిదె వీఁడె అందు నిందు నేఁగీని
వెదకి వెదకి తిరువీధులందు దేవుఁడు
॥అదె॥
అల సూర్యవీధి నేఁగీ నాదిత్యుని తేరిమీద
కలికికమలానందకరుఁడు గాన
తలపోసి అదియును దవ్వు చుట్టఱికమని
యిలఁ దేరిమీఁద నేఁగీ నిందిరావిభుఁడు
॥అదె॥
చక్క సోమవీధి నేఁగీ జందురుని తేరిమీఁద
యెక్కువైన కువలయహితుఁడు గాన
చుక్కలు మోచిన దవ్వుచుట్టరిక మిదియని
యిక్కువతో వీధి నేఁగీ నెన్నికైన దేవుఁడు
॥అదె॥
యింతుల మనోవీధి నేఁగీ మరు తేరిమీఁద-
నంతటా రతిప్రియుఁ డటుగాన
రంతుల నదియుఁ గానరాని చుట్టరికమని
వింతరీతి నేఁగీ శ్రీవేంకటాద్రిదేవుఁడు
॥అదె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము