Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 87-3
సంపుటము: 1-425
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
శ్రీవేంకటేశుఁడు శ్రీపతియు నితఁడే
పావనపు వైకుంఠపతియును నితఁడే
॥శ్రీవేంకటే॥
భాగవతములోఁ జెప్పే బలరాము తీర్థయాత్ర-
నాగమోక్తమైన దైవమాతఁ డితడే
బాగుగా బ్రహ్మాండపురాణపద్ధతి యాతఁ డితఁడే
యోగమై వామనపురాణోక్త దైవ మీతఁడే
॥శ్రీవేంకటే॥
వెలయ సప్తరుషులు వెదకి ప్రదక్షిణము-
లలరఁ జేసిన దేవుఁ డాఁతఁ డీతఁడే
నెలవై కోనేటిపొంత నిత్యముఁ గుమారస్వామి
కలిమి దపముసేసి కన్నదేవు డీతఁడే
॥శ్రీవేంకటే॥
యెక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులు
తక్కక కొలిచియున్న తత్వమీతఁడు
చక్క నారదాదుల సంకీర్తనకుఁ జొక్కి
నిక్కిన శ్రీవేంకటాద్రినిలయుఁడు నీతఁడే
॥శ్రీవేంకటే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము