అధ్యాత్మ సంకీర్తన
రేకు: 87-5
సంపుటము: 1-427
రేకు: 87-5
సంపుటము: 1-427
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| నా తప్పు లోఁగొనవే నన్నుఁ గావవే దేవ చేఁతలిన్నీఁ జేసి నిన్నుఁ జేరి శరణంటిని | ॥నా తప్పు॥ |
| అందరిలో నంతర్యామివై నీ వుండఁగాను యిందరిఁ బనులుగొంటి నిన్నాళ్ళును సందడించి యిన్నిటా నీచైతన్యమై యుండఁగాను వందులేక నేఁ గొన్నివాహనా లెక్కితిని | ॥నా తప్పు॥ |
| లోకపరిపూర్ణుఁడవై లోనా వెలి నుండఁగాను చేకొని పూవులుఁ బండ్లుఁ జిదిమితిని కైకొని యీ మాయలు నీ కల్పితమై వుండఁగాను చౌకలేక నే వేరే సంకల్పించితిని | ॥నా తప్పు॥ |
| యెక్కడ చూచిన నీవే యేలికెవై వుండఁగాను యిక్కడాఁ దొత్తుల బంట్ల నేలితి నేను చక్కని శ్రీవేంకటేశ సర్వాపరాధి నేను మొక్కితి నన్ను రక్షించు ముందెఱఁగ నేను | ॥నా తప్పు॥ |


