అధ్యాత్మ సంకీర్తన
రేకు: 88-1
సంపుటము: 1-429
రేకు: 88-1
సంపుటము: 1-429
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| వివేకమెఱఁగని వెఱ్ఱులము గాక నేము దివారాత్రము నిన్నే ద్రిష్టించవలదా | ॥వివేక॥ |
| మానివోడ నమ్మి వొక్కమనుజుఁడు వార్ధి దాఁటి నానార్థములు గూర్చి నటించఁగాను దానవారికృప నమ్మి తగిన సంసారవార్ధి- లోను చొచ్చి దాఁటి గెల్వ లోకులకుఁ జెల్లదా | ॥వివేక॥ |
| జుట్టెఁడు యినుము నమ్మి సొరిది నొక్కఁడు భూమిఁ గట్టిడి భయములెల్లఁ గడవఁగాను నెట్టనఁ జక్రాయుధుని నిజనామ మిటు నమ్మి తట్టి భవభయములు తరి దాఁటఁ జెల్లదా | ॥వివేక॥ |
| వేలెఁడు దీపము నమ్మి వెడఁగుఁ జీఁకటిఁ బాసి పోలిమి నొక్కనరుఁడు పొదలఁగాను ఆలించి శ్రీవేంకటేశుఁ డాత్మలో వెలుఁగగాను మేలి మాతనిఁ గొలిచి మెరయంగఁ వలదా | ॥వివేక॥ |


