Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 88-2
సంపుటము: 1-430
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
ఏమియుఁ జేయఁగవద్దు యింతలోనె మోక్షము
దీమపు విజ్ఞానమే దివ్వెత్తు ఫలము
॥ఏమియు॥
పాపచింత మదిలోన [1]బారకుండా నిలిపితే
చేపట్టి దానములెల్లా జేసినంత ఫలము
కోపానలములోన కోరికలు వేల్చితేనే
యేపున యజ్ఞాలు సేసి యేచినంత ఫలము
॥ఏమియు॥
కనకముపై కాదని పోదొబ్బితేనే
తనకు వేవేలు ఘోరతపముల ఫలము
వనితల మోహముల వలఁ బడకుండితేనే
దినము గోటితీర్థాలు దిరిగిన ఫలము
॥ఏమియు॥
శ్రీవేంకటేశ్వరు జేరి కొలుచుటే
[2]ధావతి లేనియట్టి తన జన్మఫలము
భావించి యాచార్యపాదపద్మమూలమే
సావధానమున సర్వశాస్త్రార్థఫలము
॥ఏమియు॥

[1] ‘బాయకుండా’ పూ.ము.పా.

[2] ‘దావతి’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము